ప్రపంచంలో 60 శాతంపైగా కరోనా ముప్పు!

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సకాలంలో ఫలించక పోయినట్లయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతానికి పైగా జనాభా ఈ వైరస్‌ బారిన పడి చనిపోతుందని హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మెడికల్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ గాబ్రియల్‌ లియంగ్‌ సోమవారం నాడు హెచ్చరించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 43 వేల మంది ఈ వైరస్‌ బారిన పడగా, ఒక్క చైనాలోనే 42 వేల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా మరణించారు. 







కరోనాబైరస్‌ సోకిన ప్రతి రోగిద్వారా రెండున్నర శాతం మందికి సోకుతోందని, ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80 శాతం మంది ఈ వైరస్‌ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మృతుల సంఖ్య మాత్రం ఆయన అంచనా వేసిన స్థాయిలో లేదు. ఉన్నప్పటికీ చైనా వైద్యాధికారులు వెల్లడించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 


మృతుల సంఖ్యను పక్కన పెడితే వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య ప్రస్తుతం గుర్తించిన దానికన్నా చాలా ఎక్కువే ఉండవచ్చని, వైరస్‌ను గుర్తించే మెడికల్‌ కిట్లు తక్కువగా ఉండడం, ఇంకా లక్షలాది మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండడం పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని చైనాలోని వుహాన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు.ఇదిలావుండగా, ఈ వైరస్‌ నేడు ప్రపంచానికే పెను ప్రమాదంగా పరిణమించిందని, వైరస్‌ శాంపిల్స్‌ను తెప్పించుకొని త్వరితగతిన నివారణ మందు కనుగొనేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి డాక్టర్‌ టెండ్రాస్‌ అధానమ్‌ పిలుపునిచ్చారు.